Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 36

Goddess Parvati !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

బాలకాండ
ముప్పది ఆఱవ సర్గము
( పార్వతీ దేవి మహిమ)

ఉక్తవాక్యే మునౌ తస్మిన్ ఉభౌ రాఘవలక్ష్మణౌ |
ప్రతినంద్య కథాం వీరౌ ఊచతుర్మునిపుంగవమ్ ||

తా|| ఆ మహాముని చేత చెప్పబడిన ఆ మాటలను విని వీరులైన ఆ రామ లక్ష్మణులిద్దరూ సంతోషపడి ఆ మునిపుంగవుని ఇట్లు అడిగిరి.

ధర్మయుక్తమిదం బ్రహ్మన్ కథితం పరమం త్వయా |
దుహితః శైలరాజస్య జ్యేష్ఠయా వక్తుమర్హసి ||
విస్తరం విస్తరజ్ఞోసి దివ్యమానుష సంభవమ్ |
త్రీన్ పథో హేతునా కేన ప్లావయేల్లోకపావనీ ||
కథం గంగా త్రిపథగా విశ్రుతా సరిదుత్తమా |
త్రిషు లోకేషు ధర్మజ్ఞ కర్మభిః కైస్సమన్వితా ||

తా|| "ఓ బ్రహ్మన్ ! అత్యంత ధర్మయుక్తమైన కథను చెప్పితిరి. ఆ శైలరాజు యొక్క పెద్దకుమార్తె గురించి చెప్పుటకు మీరే అర్హులు. దేవ లోకములోనూ మనుష్యలోకములోనూ జరిగిన ఆ నదీ వృతాంతమును విస్తరముగా విస్తరించుదురుగాక. ఆ లోకపావని మూడు లోకములలో ఏ కారణమున ప్రవహించినది ? ఓ ధర్మజ్ఞా ! త్రిపథ గా పేరుపొందిన ఈ నది ఏయే కారణములవలన ముల్లోకములలో ఉత్తమమైన నదిగా కీర్తి గాంచినది".

తథా బ్రువతి కాకుత్ స్థే విశామిత్రస్తపోధనః |
నిఖిలేన కథాం సర్వామ్ ఋషిమధ్యే న్యవేదయత్ ||

తా|| ఆ కకుశ్థుడగు శ్రీరాముడు అ విథముగా ఆయనను ప్రశ్నింపగా అప్పుడు తపోధనుడైన విశ్వామిత్రుడు ఆ ఋషిపుంగవుల మధ్యలో ఇట్లు ఆ పూర్తి కథను వివరించెను.

పురా రామ కృతోద్వాహో నీలకంఠో మహాతపాః |
దృష్ట్వా చ స్పృహయా దేవీం మైథునా యోపచక్రమే ||
శితికంఠస్య దేవస్య దివ్యం వర్షశతం గతమ్ |
న చాపి తనయో రామ తస్యామాసీత్ పరంతప ||

తా|| ' ఓ రామా ! పూర్వము మహాతపోధనుడైన నీలకంఠుడు ఆ దేవిని మన్మథ ప్రభావముచే వివాహము చేసికొనెను. పిమ్మట నీలకంఠుడు ఆ దేవీ నూరు సంత్సరములు గడిపిరి. కాని ఓ పరంతపా ! వారికి తనయులు పుట్టలేదు'.

తతో దేవాః సముద్విగ్నాః పితామహ పురోగమాః|
యదిహోత్పద్యతే భూతం కస్తత్ ప్రతిసహిష్యతే ||
అభిగమ్య సురాస్సర్వే ప్రణిపత్యేదమబ్రువన్ |
దేవ దేవ మహాదేవ లోకస్యాస్య హితేరత ||
సురాణాం ప్రణిపాతేన ప్రసాదం కర్తుమర్హసి |
న లోకా ధారయిష్యంతి తవ తేజః సురోత్తమ ||
బ్రాహ్మేణ తపసా యుక్తో దేవ్యా సహ తపశ్చర |
త్రైలోక్యహిత కామార్థం తేజస్తేజసి ధారయ ||

తా|| అప్పుడు దేవతలందరూ ఇంత కాలము తరువాత తనయుడుకలిగినచో ఆ ప్రభావమునకు లోకము తట్టుకొనగలదా అని భయపడిరి. ఆ దేవలందరూ వచ్చి ప్రణమిల్లి , " ఓ దేవ దేవా !మహాదేవా ! లోకముయొక్క హితముకొఱువాడా ! నీ పాదములను ఆశ్రయించిన సురులందరినీ అనుగ్రహింపుము . నీ యొక్కతేజమును ఈ లోకములు భరింపజాలవు. నీవు దేవితో సహా బ్రహ్మముగురించి తపమొనర్చుము. మూడులోకముల హితము కోసము నీ తేజస్సును నీలోన ఉంచుకొనుము."

దేవతానాం వచః శ్రుత్వా సర్వలోకమహేశ్వరః |
బాఢమిత్యబ్రవీత్ సర్వాన్ పున శ్చేదమువాచహ ||
ధారయిష్యామ్యహం తేజః తేజస్యేవ సహోమయా |
త్రిదశాః పృథివీచైవ నిర్వాణమధిగచ్ఛతు ||
యదిదం క్షుభితం స్థానాత్ మమ తేజోహ్యనుత్తమమ్ |
ధారయిష్యతి కస్తన్మే బ్రువంతు సురసత్తమాః ||

తా || ఆ దేవతల వచనములను విని అన్నిలోకములకు ఈశ్వరుడగు మహేశ్వరుడు అట్లే అని చెప్పి మరల ఇట్లు పలికెను. " మా తేజస్సుని మాలోనే నిలుపు కొనెదము. దేవలోకములు పృథివీ కూడా శాంతిని పోందెదరుగాక. ఓ సురసత్తములారా ! ఒకవేళ నా ఉత్తమమైన తేజస్సు తన స్థానమునుండి కదిలినచో ఎవరు భరించగలరో తెలుపుడు" అని.

ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుః వృషభధ్వజమ్ |
యత్తేజః క్షుభితం హ్యేతత్ తద్ధరా ధారయిష్యతి ||
ఏవ ముక్తాః సురపతిః ప్రముమోచ మహీతలే |
తేజసా పృథివీ యేన వ్యాప్తా సగిరికాననా ||

తా|| అప్పుడు దేవతలు ఆ వృషభధ్వజునితో ఇట్లు పలికిరి . "మీ తేజస్సు కదిలినచో అప్పుడు దానిని భూదేవి ధరింపగలదు". దేవతలయొక్క ఇట్టి మాటలను విని మహేశ్వరుడు తన తేజస్సును భూమిపై విడిచెను. ఆ శివ తేజస్సు పర్వతములతో వనములతో గూడియున్న భూమిపై పూర్తిగా వ్యాపించెను.

ప్రవిశ త్వం మహాతేజో రౌద్రం వాయు సమన్వితః ||
తదగ్నినా పునర్వ్యాప్తం సంజాతః శ్వేతపర్వతః |
దివ్యం శరవణం చైవ పావకాదిత్యసన్నిభమ్ |
యత్ర జాతో మహాతేజాః కార్తికేయోsగ్నిసంభవః ||
అథోమాం చ శివం చైవ దేవాస్సర్షిగణాస్తదా |
పూజయామాసురత్యర్థం సుప్రీత మనసస్తతః ||

తా|| అప్పుడు దేవతలందరూ అగ్నిదేవునితో ఇట్లు చెప్పిరి." నీవు వాయుదేవునితో కలిసి శివతేజస్సును భరింపుము " అని. అప్పుడు అగ్నిచే వ్యాప్తమైన ఆ తేజస్సు శ్వేతపర్వతమాయెను. అచట అగ్నిసూర్యులతో సమానమైన తేజస్సుగల శరవణము ( గడ్డి) ఏర్పడెను. అచట మహాతేజోవంతుడు అగ్నిచే ఉద్భవించినవాడు అయిన కార్తికేయుడు ఉద్భవించెను. అప్పుడు దేవతలూ మహర్షులు అందరూ ప్రసన్నచిత్తులై పార్వతీ పరమేశ్వరులను భక్తి శ్రద్ధలతో పూజించిరి.

అథ శైలసుతా రామ త్రిదశాన్ ఇదమబ్రవీత్ |
సమన్యురశపత్ సర్వాన్ క్రోధసంరక్తలోచనా ||
యస్మాన్నివారితా చైవ సంగతిః పుత్రకామ్యయా |
అపత్యం స్వేషు దారేషు తస్మాన్నోత్పాదయిష్యథ ||
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నయః |
ఏవముక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీమపి ||

తా|| ఓ రామా ! అప్పుడు శైలసుత అయిన పార్వతి క్రోధముకలిగిన ఏఱ్రటి కళ్ళతో ఆ దేవతలందరినీ శపించుచూ ఇట్లనెను."పతితోగూడి పుత్రునిపొందవలెననెడి నాకోరికకు అవరోధముకలిగించిరి కనుక మీభార్యలయందు మీకు సంతానము కలుగకుండుగాక. ఈ దినమునుండి మీ పత్నులు సంతానవతులు కాకుందురుగాక"అని . ఈ విధముగా అందరు దేవతలనూ శపించి భూదేవితో కూడా ఇట్లనెను.

అవనే నైకరూపాత్వం బహుభార్యా భవిష్యసి |
న చ పుత్రకృతాం ప్రీతిం మత్క్రోధకలుషీకృతా |
ప్రాప్స్యసి త్వం సుదుర్మేధే మమపుత్త్ర మనిచ్ఛతి ||

తా|| " వనములు లేకుండా పెక్కు రూపములు కలిగి యుండెదవు. చాలామందికి భార్యవగుదువు. నాకు పుత్రుడు కలుగకుండా చేసితివి కావున నాకోపమునకు గురి అయితివి. నీకునూ సంతాన సుఖములు లేకుండుగాక."

తాన్ సర్వాన్ వ్రీడితాన్ దృష్ట్వా సురాన్ సురపతిస్తదా |
గమనాయోపచక్రామ దిశం వరుణపాలితామ్ ||
స గత్వా తప అతిష్ఠత్ పార్శ్వే తస్యొత్తరే గిరేః |
హిమవత్ప్రభవే శృంగే సహ దేవ్యా మహేశ్వరః ||

తా|| ఆ దేవతలందరూ సిగ్గుపడుచుండుట గ్రహించి పరమేశ్వరుడు వరుణుడు పాలించు దిశగా పోవసాగెను. ఆ పరమేశ్వరుడు ఉత్తరదిశలోనున్న ఆ పర్వతమునకు పక్కన శిఖరముచేరి పార్వతీదేవితో సహా తపస్సు చేయసాగెను.

ఏష తే విస్తరో రామ శైలపుత్య్రానివేదితః |
గంగాయాః ప్రభవం చైవ శృణు మే సహ లక్ష్మణః ||

తా|| ' ఓ రామా ! ఇంతవఱకూ శైలరాజసుత అయిన పార్వతీ వృత్తాంతమును తెలిపితిని. ఇప్పుడు గంగావృత్తాంతమును తెలిపెదను లక్ష్మణునితో సహా వినుము'.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే షట్రింశస్సర్గః ||
సమాప్తం ||

|| ఈవిథముగా వాల్మీకి రామాయణములోని బాలకాండలో ముప్పది ఆఱవ సర్గ సమాప్తము.||
|| ఓమ్ తత్ సత్ ||


|| Om tat sat ||